*త్వరలో కొత్తగా మరిన్ని ఎంజేపీ స్కూళ్లు*
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలి
* ఆటల్లో ప్రావీణ్యానికి స్పోర్ట్స్ కిట్లు అందజేస్తాం
* రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు
* హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి : మంత్రి సవిత
* వత్సవాయి ఎంజేపీ స్కూల్ లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ
* రూ.49 లక్షల విరాళాలతో మౌలిక సదుపాయాలు, అదనపు గదులు నిర్మిస్తున్న దాతలకు అభినందనలు
*వత్సవాయి/జగ్గయ్యపేట* : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎంజేపీ స్కూళ్లలో క్రీడల ప్రోత్సాహానికి స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నామన్నారు. వత్సవాయి మండల కేంద్రంలో ఉన్న ఎంజేపీ బాలుర స్కూల్ ను స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)తో కలిసి మంత్రి సవిత సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డల విద్యకు రూ.వందల కోట్లు వెచ్చిస్తోందన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో మంత్రి నారా లోకేశ్ సన్న బియ్యం అందజేస్తున్నారన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున అందజేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యా మిత్ర కిట్లు అందజేశామన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో పరిశుద్ధమైన తాగునీటికి ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ బిడ్డలకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు.
*స్పోర్ట్స్ కిట్లు అందజేస్తాం*
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచే గురుకులాల్లో ఎంజేపీ గురుకులాల అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. అందుకే, రాష్ట్ర వ్యాప్తంగా ఎంజేపీ స్కూళ్లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరిన్ని ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటాలని, ఇందుకోసం స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నామన్నారు. రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకులాలను ఇంటర్మీడియట్ కళాశాలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
*దాతల సాయంపై మంత్రి అభినందనలు*
వత్సవాయి మండల కేంద్రంలో ఉన్న ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అదనపు తరగతి గదులు నిర్మిస్తున్న దాతలు చిరుమామిళ్ల రాంబాబు(ఎన్ఆర్ఐ)ను, బొగ్గవరపు వెంకటరాజారావును మంత్రి సవిత అభినందించారు. రూ.45 లక్షలు వెచ్చించి మొదటి అంతస్తులో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్న చిరుమామిళ్ల రాంబాబు(ఎన్ఆర్ఐ)ను ప్రత్యేక అభినందించారు. వారి స్ఫూర్తితో మరింత దాతలు ముందుకొచ్చి, ఎంజేపీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వత్సవాయి ఎంజేపీ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి సవిత తరగతి గదులను, విశ్రాంతి గదులను, మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను పరిశీలించారు. వంట గదిలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి రుచి చూశారు. విద్యార్థులతో మాట్లాడి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. బోధన ఎలా ఉంది… మౌలిక సదుపాయలు కల్పించారా..? అని అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అమలు చేయడంతో పాటు రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. స్కూల్ లో ఏర్పాటు చేసిన పే ఫోన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సవితను, ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను ఎంజేపీ ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ షేక్ జరీనా, ఇతర సిబ్బందితో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*జారీచేసిన వారు : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యుల వారి కార్యాలయం*
