Latest Posts

ఆలూరులో గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం: రూ.5 లక్షల ఆస్తి నష్టం.. అధికారుల ఆలస్యపు స్పందనపై ఆగ్రహం!

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో గ్యాస్ లీకేజీ అగ్నిప్రమాదం.. రూ.5 లక్షల ఆస్తి నష్టం.. ఘటన తర్వాతే కదిలిన రెవెన్యూ అధికారులు
ఆలూరు పట్టణంలోని హత్తి బెలగల్ రోడ్డులోని గాంధీ నగర్ కాలనీలో గురువారం రాత్రి గ్యాస్ లీకేజీ కారణంగా ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న కొలిమి చాంద్ బాషా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న సామగ్రి, బట్టలు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బాధిత కుటుంబానికి వెంటనే సహాయం అందాల్సి ఉండగా, రెవెన్యూ అధికారులు మాత్రం ఆలస్యంగా స్పందించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన రాత్రే అధికారులు అక్కడికి చేరుకుని తక్షణ చర్యలు తీసుకుని ఉంటే బాధిత కుటుంబానికి కొంత ఊరట లభించేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తహసీల్దార్ శోభ సువర్ణమ్మ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. అనంతరం రెవెన్యూ అధికారులు, డీలర్లు, టిడిపి నాయకుల సహకారంతో ఐదు బస్తాల బియ్యం, వంట సామగ్రి అందజేశారు. అయితే బాధితులు మాత్రం తమకు వెంటనే సహాయం అందలేదని, ప్రమాదం జరిగిన గంటల తర్వాత మాత్రమే అధికారులు స్పందించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఆస్తి నష్టం జరిగినా అత్యవసర సహాయం అందించడంలో నిర్లక్ష్యం కనిపించిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి ఘటనల్లో వెంటనే స్పందించి బాధితులకు ఆశ్రయం, ఆహారం, ఆర్థిక సహాయం అందించాల్సి ఉండగా, కేవలం పరామర్శలకే పరిమితం కావడం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబానికి తక్షణ నష్టపరిహారం ప్రకటించి, పూర్తిస్థాయిలో ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బసవన్న గౌడ్, విఆర్వోలు అక్కమ్మ, రవి, టిడిపి నాయకులు నెట్టప్ప, గుండన్న, నరసప్ప, పట్టణ అధ్యక్షుడు కిట్టు, యువ నాయకుడు అంజి తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor