అనంతపురం జిల్లా, రాయదుర్గం.
ఐదేళ్ల వైకాపా పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి అటు అసెంబ్లీలో, ఇటు పార్టీ సమావేశాల్లో ఏనాడైనా ప్రస్తావించారా? పనులు ఆపివేసిన మీ నాయకుడిని నిలదీశారా..? అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సీమ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ముందు మూగనోము వహించిన ఆపార్టీ వారికి నేడు రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని తన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వైకాపా నేతలపై విరుచుకపడ్డారు.
సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది ఎవరు?
2019లో అధికారంలోకి రాగానే హంద్రీనీవా ప్రాజెక్ట్ పనులను అర్ధాంతరంగా ఆపివేసి… సీమ ప్రయోజనాలను కాలరాచింది మీరు కాదా..? అని నిలదీశారు. హంద్రీనీవా ప్రధాన ప్రాజెక్టుతో పాటు జీడిపల్లి-పేరూరు, జీడిపల్లి-బైరవాని తిప్ప, 36వ ప్యాకేజీ, ఉరవకొండ సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టులను ఎందుకు ఆపివేస్తున్నారని ఐదేళ్ల పాలనలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. ఐదేళ్లు రాయలసీమ భవిష్యత్తుకు సమాధి కట్టిన వారు, తడిగుడ్డతో గొంతు కోసిన కసాయి మూకలు నేడు ముసలి కన్నీరు కారుస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక జగన్‌కు బానిసలుగా బతికిన వారు నేడు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే “దయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉందని దుయ్యబట్టారు.
ఎప్పుడో నిలిచిపోయిన ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం:
జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతించక 2021లోనే ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ఆపగలుగుతారని ప్రశ్నించారు. మాట్లాడే ముందు ఏం చెబుతున్నారో కనీస అవగాహన ఉందా అని నిలదీశారు. “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభమే చేయలేదని, కేవలం డి.పి.ఆర్ తయారీ, ప్రాథమిక ఏర్పాట్ల దశలోనే ఉన్నాయని” ఆనాడు జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు వివరణ ఇచ్చింది మీ పార్టీ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు.
వాస్తవానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నేరుగా అనంతపురానికి చేకూరే లబ్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సీమ పేరుతో వేల కోట్లు దోచుకోవడానికే ఈ ప్రాజెక్టును రూపొందించారని ఆరోపించారు. 2021లో ఆగిపోయిన పనులను నేడు చంద్రబాబు ఆపేశారంటూ కాకమ్మ కథలతో, కల్లిబొల్లి మాటలతో సీమ ప్రజలను మరోసారి మోసగించేందుకు వైకాపా నేతలు రౌండ్ టేబుల్ సమావేశాల ముసుగులో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిధుల ఖర్చులో వ్యత్యాసం:
టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ. 12 వేల కోట్లు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మొదటి రెండు ఏళ్లలో రూ. 8 వేల కోట్లు కలిపి దాదాపు రూ. 20 వేల కోట్లు సీమ సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన ఘనత తమదేనన్నారు. కానీ, ఐదేళ్ల వైకాపా పాలనలో ఖర్చు పెట్టింది కేవలం రూ. 2,100 కోట్లు మాత్రమేనని వివరించారు. దీన్ని బట్టి రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే బురదజల్లుతున్నారు:
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలనలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుండటంతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. దీన్ని ఓర్చుకోలేని సీమ వైకాపా నేతలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాడు వైకాపా సహకారంతోనే కేంద్రంలో అనేక బిల్లులు పాసయ్యాయని, వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎందుకు అనుమతులు తెచ్చుకోలేకపోయారో ప్రజలు ఆలోచించాలన్నారు. రాజధాని విషయంలో ఐదేళ్లు మాయ మాటలతో మభ్యపెట్టిన జగన్, నేడు అమరావతి అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో రోజురోజుకూ పడిపోతున్న వైసీపీ గ్రాఫ్ చూసి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో వైకాపా నేతలు ఉన్నారని, తప్పుడు మాటలు మాట్లాడి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దని కాలవ హితవు పలికారు.
