Latest Posts

ముదిగుబ్బలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం…

 

ముదిగుబ్బ మండల కేంద్రంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముదిగుబ్బ అప్‌గ్రేడ్ సీఐ శివరాముడు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు ముఖ్య సూచనలు చేశారు.

మండల కేంద్రంలోని సంత మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ శివరాముడు మాట్లాడుతూ, ఆటోలలో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదాలకు దారితీస్తుందని, ఇటువంటి చర్యలు డ్రైవర్లతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయని స్పష్టం చేశారు. ప్రతి ఆటోలో అనుమతించిన పరిమితి మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించాలని ఆయన సూచించారు.

అదేవిధంగా, ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలని, డ్రైవర్లు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి డ్రైవర్ యూనిఫామ్ ధరించాలనితెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడమే కాకుండా అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వేగ పరిమితులను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని స్పష్టంగా సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలపై మరింత స్పష్టత పొందారని, భవిష్యత్తులో నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Posted Under AP
Editor