ముదిగుబ్బ మండలం దేవరగుడిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజముద్రతో కూడిన ఈ-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ముదిగుబ్బ డిప్యూటీ తహసీల్దార్ మునిస్వామి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జ్ తుమ్మల మనోహర్ హాజరై, రైతులకు ఈ-పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జనవరి 2, 2026 నుంచి కొత్త ఈ-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు.
గతంలో జారీ చేసిన పాస్ పుస్తకాలలో ఉన్న లోపాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్‌లతో కూడిన సరికొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో జగన్ చిత్రంతో ముద్రించిన పాస్ పుస్తకాలను రద్దు చేసి, పారదర్శకత కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
2024 ఎన్నికల హామీ మేరకు ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా క్యూఆర్ కోడ్ సదుపాయం కలిగిన పాస్ పుస్తకాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వెబ్‌ల్యాండ్ డేటాతో అనుసంధానించి ఈ పుస్తకాలను అందజేస్తున్నామని, పంపిణీ సమయంలో రైతుల వేలిముద్రలు, సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. రైతుల ఈ-కేవైసీ ప్రక్రియను స్థానిక వీఆర్వోలు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మోహన్, నాగభూషణ్, కుమార్ నాయక్, చంద్రశేఖర్, రమేష్, ప్రభాకర్, అశోక్, లక్ష్మీపతి సోము తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులు, గ్రామ రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
