Latest Posts

అనంతపురంలో జర్నలిస్టుల మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం: 236 మందికిపైగా సేవలు అందజేత

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

236 మందికిపైగా జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు

మీడియా మిత్రులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం, మార్చి 31:
అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధుల కోసం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించి, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బీపీ చెకప్ చేయించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంపై అవగాహన చాలా అవసరమని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సిబ్బంది, వివిధ వృత్తుల వారితో పాటు జర్నలిస్టులకు ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అవసరమన్నారు. డిజిటల్ హెల్త్, అభా (ABHA) ఐడి వంటి సాంకేతికతలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషించాలన్నారు.
ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ ఏ. బాలకొండయ్య మాట్లాడుతూ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులు, వారి కుటుంబ సభ్యులు, జర్నలిస్టు సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం స్పెషలిస్ట్ డాక్టర్లు కన్సల్టేషన్ చేసి అవసరమైన మందులు అందజేశారని చెప్పారు. మొత్తం 236 మందికిపైగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
ఈ శిబిరంలో రక్తపోటు, ఈసీజీ, 2డీ ఎఖో, సీబీపీ, ఎల్ఎఫ్‌టీ, ఆర్ఎఫ్‌టీ, లిపిడ్ ప్రొఫైల్, రక్త చక్కెర, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, న్యూరో ఫిజీషియన్, దంత వైద్యుడు, ఈఎన్‌టి, యూరాలజిస్ట్, నేత్ర వైద్యులు సేవలు అందించారు.
వైద్య పరీక్షల రిజల్ట్స్ ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ కార్యాలయంలో అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. కిమ్స్ సవేరా, పావని, మార్క్, శ్రీనివాస, చంద్ర, కుమార్, స్నేహలత, మ్యాగ్నస్, మమత ఆస్పత్రులు ఈ శిబిరంలో భాగస్వామ్యం అయ్యాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైద్యులు, ఐ.అండ్.పీఆర్ సిబ్బంది, ఆస్పత్రుల ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor