అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీ వాసులు మంగళవారం ధర్నాకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసనలో కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన జగనన్న కాలనీలో ప్రస్తుతం సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. అయితే తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఒక బోరు పూర్తిగా మట్టితో నిండిపోయి పనిచేయడం లేదని, మరొక బోరులో నీరు రాకపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. కాలనీలో వీధిలైట్లు లేకపోవడం వలన రాత్రిపూట కల్లీలు చిరుతలు పాములు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణం వీధిలైట్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద మున్సిపాలిటీలో ఇంటింటికి కులాయి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఆ పనులు ఎక్కడ వరకు వచ్చాయని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి కురాకులతోట కాలనీలో స్వయంగా పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తామని, మూడు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు బుడెన్, సనావుల్లా నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
