చిత్తూరు:
అమ్మ.. ఈ రెండక్షరాల పిలుపులో అనంతమైన ప్రేమ ఉంటుంది. ఆకలితో అలమటించే బిడ్డకు అమృతంలా పాలిచ్చే ఆ తల్లి ప్రేమే లోకానికి ఆధారం. కానీ, తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన చూస్తుంటే, మానవత్వం సిగ్గుతో తలదించుకుంటోంది. ఆకలితో ఏడుస్తున్న పసికందుపై కరుణ చూపాల్సిన ఆ కన్నతల్లే కాలయముడైంది.
క్షణికావేశం.. కడతేరిన పసిపాణం
తమిళనాడుకు చెందిన హైమావతి, వెంకటేష్ దంపతులు బతుకుదెరువు కోసం సత్యవేడుకు వచ్చి సిమెంట్ రాళ్ల తయారీ పనుల్లో శ్రమిస్తున్నారు. వారికి ఐదేళ్ల కుమారుడు, ఆరు నెలల పసికూతురు ఉన్నారు. గురువారం ఉదయం ఆ చిన్నారి పాల కోసం గుక్కపట్టి ఏడ్చింది. ఆ ఏడుపు ఆ తల్లిలో జాలిని నింపాల్సింది పోయి, రక్తం ఉడికించింది. పని ఒత్తిడిలో ఉందో, లేక క్షణికావేశానికి లోనైందో కానీ.. పాలు ఇచ్చి లాలించాల్సిన చేతులతోనే ఆ పసిపాప గొంతు నులిమింది.
విలపిస్తున్న ప్రకృతి.. విస్తుపోతున్న జనం
లోకం తెలియని ఆ పసిబిడ్డ, తన ఆకలి తీర్చమని తన భాషలో వేడుకుంది. కానీ, ఆ మూగ వేదన ఆ తల్లి హృదయాన్ని తాకలేకపోయింది. కాసేపటికే ఆ పసిబిడ్డ కదలికలు ఆగిపోయాయి. చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. నిశ్శబ్దంగా పడి ఉన్న ఆ చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. “బిడ్డ ఆకలి తీర్చాల్సిన తల్లి, ఆ బిడ్డ ప్రాణాన్నే తీయడం దారుణానికి పరాకాష్ట. ఆకలి కేకలు వేసిన ఆ గొంతుకను శాశ్వతంగా మూగబోయేలా చేయడం ఏ చట్టం క్షమించలేని నేరం.” అంటున్నారు జనం. సమాచారం అందుకున్న సీఐ మురళీ నాయుడు, ఎస్సై సాయినాథ్ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలు ఇంతటి ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అమ్మ ఒడి అన్నది బిడ్డకు శ్రీరామరక్ష కావాలి. కానీ, అదే ఒడి మృత్యువుగా మారడం కలికాలపు వైపరీత్యం. ఆకలి కోసం ఏడ్చిన ఆ చిన్నారి చిరునవ్వు ఇప్పుడు కేవలం ఒక ఛాయాచిత్రంగానే మిగిలిపోయింది. మాతృత్వపు మమకారాన్ని ప్రశ్నిస్తున్న ఈ విషాదం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.
