- కుటుంబ వ్యవస్థకు మూలస్తంభం మహిళ – టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) డా. ఎ. శరత్
- 32 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు
- మహతి కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తిరుపతి:
భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ మూలస్తంభమని, పండితులకు వేదం ఎంత పవిత్రమో గృహాలకు గృహలక్ష్మి అంతే పవిత్రమని టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) డా. ఎ. శరత్ పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ కుటుంబ నిర్మాణం, సమాజ అభివృద్ధి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రతి మనిషికి తల్లి మొదటి గురువని, పిల్లలకు ధర్మం, సంస్కారం, విలువలు నేర్పేది తల్లేనని తెలిపారు. తల్లి సద్గుణవంతురాలైతే కుటుంబం సుస్థిరంగా ఉంటుందని, కుటుంబం బాగుంటే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమాజం అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం కూడా ప్రగతి మార్గంలో ముందుకు సాగుతాయని అన్నారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తారని వివరించారు.
టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ, సనాతన ధర్మంలో మహిళకు అత్యున్నత స్థానం కల్పించబడిందన్నారు. స్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని తెలిపారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు.
న్యూఢిల్లీకి చెందిన మిత్రావక్, డిజిటల్ మహిళ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో ఆశ్లేష మాట్లాడుతూ, మహిళల్లో అపారమైన శక్తి, చైతన్యం నిక్షిప్తమై ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్న గౌరవస్థానం ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ సుఖశాంతులు, ఐశ్వర్యం వర్థిల్లుతాయని పేర్కొన్నారు.
డిఆర్‌డిఓ శాస్త్రవేత్త డా. చంద్రిక కౌశిక్ మాట్లాడుతూ, సమాజంలో సానుకూల మార్పు రావాలంటే మహిళలు ముందుగా తమను తాము ప్రాధాన్యంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యతలను పంచుకుంటే మహిళలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలను కుటుంబ సభ్యులు కలిసి పంచుకోవడం ద్వారా సమతుల్య జీవనం సాధ్యమవుతుందని సూచించారు.
పద్మావతి అవార్డులు
టీటీడీలోని పలు విభాగాల్లో విశేష సేవలు అందిస్తున్న 32 మంది మహిళా ఉద్యోగులకు ఈ సందర్భంగా పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. వారిని శాలువాతో సత్కరించి, 5 గ్రాముల వెండి డాలర్ మరియు శ్రీ పద్మావతి అమ్మవారి జ్ఞాపిక అందజేశారు.
అదేవిధంగా రాబోయే ఏడాది కాలంలో పదవీ విరమణ చేయనున్న 78 మంది మహిళా ఉద్యోగులను కూడా శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, వీణా వాద్యకచేరి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్, గాత్ర సంగీత పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టీటీడీ మహిళా ఉద్యోగులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.
ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. కృష్ణవేణి, టీటీడీ పీఆర్వో (ఎఫ్‌ఏసీ) కుమారి పి. నీలిమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు, పలువురు మహిళా డిప్యూటీ ఈఓలు, ఇతర అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
