శ్రీకాళహస్తి:
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం. ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద ఉన్న షెడ్డులో భజనలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతుంటాయి. అయితే ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంగణం రాజకీయ ప్రసంగాలకు వేదికగా మారిపోయింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి దేవస్థానం షెడ్డు వేదిక అయింది. దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సతీమణి, ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టిడిపి నాయకులు ముని రాజా నాయుడు, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్ నాయుడు, మహిళా నాయకులు, కమిషనర్ భవాని ప్రసాద్, మహిళా ఎస్సై వేదికపై కూర్చున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికార పార్టీ నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలతో ప్రాంగణం నిండిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి నాయకులు ప్రసంగించారు. ఆధ్యాత్మిక ప్రాంగణం రాజకీయ ప్రసంగాలకు వేదిక కావడంపై భక్తులు ఆవేదన వ్యర్థం చేస్తున్నారు…
