*భక్తులను రక్షించడం కోసం ఆ శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలో అవతారం దాల్చి దుష్టుల శిక్షించి శిష్టులను రక్షించుకుంటున్నాడు.శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కొండల లక్ష్మీ నారసింహుడుగా , కాటమ రాయుడుగా వెలసిన స్తోత్రాద్రిపై ( కదిరి కొండ ) మొదట పాదం మోపారని అందుకే ఈ క్షేత్రానికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇంతటి మహత్యం కలిగిన కదిరికొండకి శ్రీ వారి భక్తులు శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తూర్పు రాజగోపురం వద్ద నుంచి పాదయాత్రగా బయలుదేరి కుమ్మరవాండ్ల పల్లి గ్రామంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన కదిరి కొండ వద్దకు చేరుకొని అర్చకులు ప్రత్యేక హారతులు ఇచ్చిన అనంతరం గోవింద నామస్మరణతో హరి కీర్తనలతో జయ జయ సింహా జై శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ అంటూ మహిళలు,వృద్ధులు,పిల్లలు,యువకులు పెద్దయెత్తున స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు “శ్రీ సత్య సాయి బాబా సేవా సమితి కదిరి బృందం” వారు మహాప్రసాద వితరణ సదుపాయం కల్పించారు. ఆలయ అధికారులు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు భక్తులకు మంచినీరు , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.శ్రీ వారి భక్తుల సౌకర్యార్థం కదిరి కొండ చుట్టూ ఆలయ అధికారులు , ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి గిరి ప్రదక్షిణకు అనుకూలంగా రహదారి నిర్మించాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మరియు శ్రీ వారి భక్తులు కోరుకుంటున్నారు.*
