Latest Posts

కార్మికులకు ‘ఆర్థిక భరోసా’: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి – సహాయ కార్మిక అధికారి సత్యనారాయణ పిలుపు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

కార్మికులను అన్ని రంగాలలో ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
కార్మిక కార్డు పొందండి… ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా పొందండి: సహాయ కార్మిక అధికారి సత్యనారాయణ
కార్మికులను మరియు వారి కుటుంబాలను అన్ని రంగాలలో ఆదుకోవడంతో పాటు వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ చర్యలు చేపడుతున్నాయని రాయదుర్గం సహాయ కార్మిక అధికారి జి. సత్యనారాయణ తెలిపారు.
శనివారం రాయదుర్గంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల కార్మికులు కార్మిక శాఖలో నమోదు చేసుకుని సంవత్సరానికి రూ.110 రుసుము చెల్లించి కార్మిక గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. ప్రతి సంవత్సరం కార్డు రెన్యువల్ తప్పనిసరిగా చేసుకోవాలని, కార్డు రెన్యువల్ ఉన్నప్పుడే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందగలరని చెప్పారు.
కార్మిక గుర్తింపు కార్డు ఉన్నవారికి పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్మికుల పిల్లల పెళ్లికి ప్రభుత్వం రూ.40,000 ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. దీనికోసం పెళ్లి ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా కార్మికుల దహన సంస్కారాలకు రూ.20,000, సహజ మరణం సంభవించినపుడు కుటుంబానికి రూ.60,000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నా కార్మిక కార్డు రెన్యువల్ అయి ఉండటం తప్పనిసరి అని ఆయన గుర్తుచేశారు.
కార్మిక సంక్షేమ పథకాలపై రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం 11,589 మంది కార్మికులు నమోదు అయ్యారని సహాయ కార్మిక అధికారి సత్యనారాయణ వెల్లడించారు.

Posted Under AP
Editor