రాయదుర్గంలో రూ.2,800 కోట్లతో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు..

*రాయదుర్గంలో రూ.2,800 కోట్లతో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు.*

*స్థానికులకు ఉపాధి అవకాశాలు : ఎమ్మెల్యే కాలవ.*

రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో రూ.2,800 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి కానుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, టాటా పవర్ లిమిటెడ్ సహకారంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు అవుతున్నట్లు గురువారం రాయదుర్గంలో ఆయన ఓ పత్రిక ప్రకటనలో వెల్లడించారు. కనేకల్, డి.హీరేహాల్, బొమ్మనహాల్ మండలాల పరిధిలోని సుమారు 15 గ్రామాల్లో ఈ పవన విద్యుత్ ప్రాజెక్టు అమలు కానుందని వివరించారు. పర్యావరణానికి అనుకూలంగా స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని, దీని ద్వారా సమాజానికి, పర్యావరణానికి ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఒక్కో విండ్ టర్బైన్ ఏర్పాటు చేయడానికి సుమారు 7 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. ప్రాజెక్టు కోసం భూమిని అందించే భూ యజమానులకు కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అద్దె చెల్లిస్తుందని వెల్లడించారు. తద్వారా భూ యజమానులకు దీర్ఘకాలికంగా ఆదాయ వనరు ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. పవన విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ తదితర కార్యకలాపాల ద్వారా నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించే అవకాశం ఉందన్నారు. భూ యజమానులు తమ పొలాలకు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా సుజ్లాన్ సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన రోడ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 127 విండ్ టర్బైన్ జనరేటర్లను ఏర్పాటు చేస్తారని, ఒక్కో టర్బైన్ సామర్థ్యం 3.15 మెగావాట్లు ఉండనుందన్నారు. మొత్తం సుమారు 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సుమారు రూ.7 కోట్ల పెట్టుబడి అంచనాతో మొత్తం 400 మెగావాట్ల ప్రాజెక్టుకు సుమారు రూ.2,800 కోట్ల పెట్టుబడి రానుందని ఆయన వివరించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం ఈ ప్రాంత అభివృద్ధికి, స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పనకు చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. భూ యజమానులకు ఆదాయ వనరుల పెంపునకు దోహదపడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Posted Under AP
Editor