పలమనేరు వద్ద మృత్యుఘోష…..

  • పలమనేరు వద్ద మృత్యుఘోష
  • ఆగివున్న లారీని ఢీకొన్న కారు
  • ఐదుగురు బెంగళూరు యాత్రికుల దుర్మరణం

 

దైవ దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో వెళ్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా పలమనేరు శివారులోని గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం జరిగిన భీకర ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా దూసుకొచ్చిన కారు, రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

అతివేగమే ఐదుగురి ప్రాణాలు తీసింది

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రాజాజీ నగర్‌కు చెందిన మోహన్ దాస్ కుటుంబం బుధవారం తెల్లవారుజామున కారులో తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు. పలమనేరు దాటిన తర్వాత గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన సిమెంట్ లారీని, వీరు ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంతో వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందికి దూసుకుపోయింది. కారులో ఉన్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బెంగళూరు రాజాజీ నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో మోహన్ దాస్ (71), నాగరాజరావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33) ఉన్నారు.

హృదయవిదారక దృశ్యాలు

ప్రమాద సమాచారం అందిన వెంటనే పలమనేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు శిథిలాల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సాయంతో పోలీసులు, స్థానికులు బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మంత్రి దిగ్భ్రాంతి
ఈ ఘోర ప్రమాదంపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పోలీసుల విచారణ

డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం లేదా అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల బంధువులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంతో విషాద ఛాయలు అలముకున్నాయి

Posted Under AP
Editor