రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం

  • రెవెన్యూ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
  • గడువులోగా భూ సమస్యలు పరిష్కరించండి
    -కలెక్టర్ సుమిత్ కుమార్

భూ సంబంధిత సమస్యలు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయని, వాటి పరిష్కారంలో రెవెన్యూ అధికారులు అత్యంత బాధ్యతగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వేర్లతో సమీక్ష జరిపిన కలెక్టర్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే అర్జీలను నిర్దేశిత గడువు లోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. “అర్జీలు పెండింగ్‌లో ఉంటే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గుతుంది. నాణ్యతతో కూడిన పరిష్కారం చూపడమే అధికారుల ప్రథమ కర్తవ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో విలేజ్ సర్వేర్ల లాగిన్లను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను తక్షణమే పూర్తి చేయాలి. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డుల నమోదు ప్రక్రియను గడువులోగా ముగించాలన్నారు. భూ సమస్యలపై కోర్టుల్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలని… జిల్లాలో ఉన్న 276 ఆర్ఓఆర్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ వినతులపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని… తిరస్కరణకు గురైన అర్జీలకు స్పష్టమైన కారణాలను నివేదికలో పొందుపరచాలన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపైనే ఉంది. ఎక్కడా ఆక్రమణలకు తావు ఉండకూడదన్నారు.
ప్రజా సేవలో 80శాతం సానుకూలత రావాలి

రెవెన్యూ సేవలపై ప్రజల్లో కనీసం 80 శాతం మేర సానుకూల భావన పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కోరారు. వెబ్‌ల్యాండ్స్ రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, గ్రామ స్థాయిలో విఆర్ఓలతో నిరంతరం సమీక్షలు జరపాలని తహశీల్దార్లకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్, వివిధ డివిజన్ల ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor