మహిళా సాధికారతకు సమన్వయమే కీలకం -పీడీ వెంకటేశ్వరి

మహిళల అభ్యున్నతి మరియు సాధికారత కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి వెంకటేశ్వరి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో ‘మిషన్ శక్తి – సంకల్ప హబ్’ 20 రోజుల కార్యక్రమం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరి మాట్లాడుతూ.. మహిళా రక్షణ, సాధికారత కేవలం ఒక శాఖతోనే సాధ్యం కాదని, అన్ని లైన్ విభాగాల సహకారం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి మహిళలకు చైతన్యం కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార మార్గాలపై వచ్చిన సలహాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

అవగాహన పెరగాలి: సీఐ శ్రీనివాసులు

మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు, పోక్సో చట్టం, డ్రగ్స్ దుర్వినియోగం వంటి సామాజిక అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం వల్ల తలెత్తుతున్న సైబర్ క్రైమ్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor