Latest Posts

“కొడుకు తప్పు చేశాడు.. కానీ పెంపకాన్ని తిట్టకండి”: నటుడు ప్రభాకర్ భావోద్వేగ విన్నపం

తన కుమారుడు చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా వేడుకలో తలెత్తిన అసభ్య పదజాల వివాదంపై సీనియర్ నటుడు ప్రభాకర్ తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. తన కుమారుడు చేసిన తప్పును అంగీకరిస్తూనే, సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం

ప్రభాకర్ మాట్లాడుతూ.. తన కుమారుడు వేదికపై బూతులు మాట్లాడటం ఖచ్చితంగా తప్పేనని, దాన్ని తాను ఎన్నటికీ సమర్థించబోనని స్పష్టం చేశారు. “ఆ పాట సగం అయ్యాక నేను ఈవెంట్‌కు వెళ్లాను. అప్పుడే చంద్రహాస్‌ను పిలిచి ఇలాంటివి మళ్లీ చేయవద్దని ప్రైవేట్‌గా మందలించాను” అని తెలిపారు. లైవ్‌లో కేవలం వెయ్యి మంది చూసిన ఆ విషయాన్ని, కావాలని ఎడిట్ చేసి వైరల్ చేయడం ద్వారా ఆ తప్పును మరింత మందికి చేరవేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు.

కుటుంబంపై వ్యక్తిగత దాడులు

ఈ వివాదంలోకి తన భార్య, కుమార్తెను లాగడంపై ప్రభాకర్ మండిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో వారు చెన్నైలో షూటింగ్‌లో ఉన్నారని, వాస్తవాలు తెలియకుండా వారిని విమర్శించడం తగదని కోరారు. “చంద్రహాస్ వాడిన ఒక్క పదాన్ని పట్టుకుని నా పెంపకం గురించి ప్రశ్నించడం బాధాకరం. బూతులు మాట్లాడటం తప్పే, కానీ ఆ తప్పును ఎత్తి చూపే క్రమంలో ఇతరులు వందల బూతులు తిడుతూ వీడియోలు చేయడం కూడా తప్పే కదా?” అని ఆయన ప్రశ్నించారు.

బహిరంగ క్షమాపణలు

తన కుమారుడి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డ ప్రేక్షకులకు, సమాజానికి ప్రభాకర్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన మీద ప్రేమతో ఈవెంట్‌కు వచ్చిన అతిథులు జేడీ చక్రవర్తి, జయంత్ సి పరాన్జీ, ఆదిలకు కూడా సారీ చెప్పారు. ఇకపై ఎక్కడా బూతులు వినిపించకుండా చేసే పోరాటంలో తాను కూడా ఉంటానని, తన కుమారుడిలోని తప్పులను ఎంచినట్లే, వాడి టాలెంట్‌ను కూడా చూడాలని ఆయన విన్నవించుకున్నారు.

Editor