Latest Posts

నేటి నుంచి విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ వెల్లడి

  • విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై
    నేటి నుంచి ప్రజాభిప్రాయసేకరణ..
  • ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి..

 

విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈనెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీఈఆర్సీ చైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి అధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) పై ఈనెల 20వ తేదీన తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనూ, 22, 23 తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనూ, 27న కర్నూలులోని ఏపీఈఆర్సి కార్యాలయంలోనూ ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్ కు సంబంధించిన ప్రజాభిప్రాయాలను స్వీకరిస్తారన్నారు. అభిప్రాయాలు తెలియజేయదలుచుకున్న వారు నేరుగా ఆయా వేదికల వద్ద పాల్గొనవచ్చని, నేరుగా పాల్గొనలేని వారికోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం లేదా డివిజన్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకోనివారు కూడా విద్యుత్ నియంత్రణా మండలి అనుమతితో అభిప్రాయాలను తెలియచేయవచ్చన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రత్యక్ష ప్రసారాన్ని https://www.eliveevents.com/aperc2026 ద్వారా వీక్షించవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Posted Under AP
Editor