- న్యాయం దక్కని ఆవేదన
- కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ సాక్షిగా ఒక అన్నదాత ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడటం తీవ్ర సంచలనం రేపింది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏళ్ల తరబడి న్యాయం కోసం తిరిగిన ఒక దళిత రైతు, చివరకు కలెక్టరేట్ గడపపైనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలివీ… వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతుకు గ్రామంలో డీకేటీ భూమితో పాటు 1.05 ఎకరాల సెటిల్మెంట్ భూమి ఉంది. అయితే, స్థానిక జడ్పీటీసీ సభ్యుడు సుకుమార్ తన డీకేటీ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడమే కాకుండా… తన సొంత సెటిల్మెంట్ పొలంలోకి కూడా అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని నాగరాజు గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్యాయంపై బాధితుడు నాగరాజు అనేకమార్లు స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నేరుగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా… నెలలు గడిచినా ఎటువంటి పరిష్కారం లభించలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ జరుగుతున్న సమయంలో నాగరాజు ఆటోలో కిరోసిన్ డబ్బాతో వచ్చారు. లోపలికి వెళ్లేందుకు సిబ్బంది అనుమతించక పోవడంతో, కొంత సమయం నిరీక్షించిన ఆయన ఒక్కసారిగా ఆవేదనతో కుప్పకూలిపోయారు. వెంటనే వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి, ఆయనపై నీళ్లు పోసి మంటలు చెలరేగకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
