Latest Posts

డ్రగ్స్ కేసు సాక్ష్యాలు ఏమయ్యాయి?: కేసీఆర్, కేటీఆర్‌లపై బండి సంజయ్ సంచలన విమర్శలు

తెలంగాణలో గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులోని కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో పట్టుబడిన పలువురు సెలబ్రిటీలు కేటీఆర్ పేరును ప్రస్తావించారని, కానీ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును కాపాడేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నివేదికలను బయటకు రాకుండా అడ్డుకున్నారని సంజయ్ విమర్శించారు.

ఈ కేసు దర్యాప్తులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేష్ కుమార్ పాత్రపై బండి సంజయ్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. నాటి సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ అన్ని ఆధారాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని, అయితే అది సోమేష్ కుమార్ చేతుల్లోకి వెళ్ళాక ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కీలకమైన ఆడియో, వీడియో సాక్ష్యాలు ఉన్న ఫైళ్లను మాయం చేయడం లేదా మార్చడం నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి సోమేష్ కుమార్‌ను వెంటనే విచారించాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ఈ కేసును ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ మొదటి నుంచి విచారించాలని సంజయ్ సూచించారు. ముఖ్యంగా గతంలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన అకున్ సబర్వాల్‌కే మళ్లీ ఈ కేసు బాధ్యతలను అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానమేనని, డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులను వదిలిపెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు.

Editor