గూడూరు నియోజకవర్గంతో పాటు కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని ఆయన కొనియాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన వల్ల నెల్లూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని సోమిరెడ్డి విమర్శించారు. శ్రీసిటీ, షార్ (SHAR), పులికాట్ సరస్సు వంటి కీలక ప్రాంతాలతో పాటు చెంగాళమ్మ, పోలేరమ్మ వంటి ప్రముఖ దేవాలయాలను కూడా జిల్లా కోల్పోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అస్తవ్యస్తమైన విభజన కారణంగా జిల్లా భౌగోళిక స్వరూపమే దెబ్బతిందని, రామాయపట్నం పోర్టు ఉన్న కందుకూరు కూడా జిల్లా నుండి విడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పుడు గూడూరు డివిజన్‌లోని మూడు ప్రధాన మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల జిల్లా ప్రజలకు పెద్ద ఊరట లభించిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్‌తో పాటు జిల్లా వాసులందరిలో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి, వారి సెంటిమెంట్లను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు ఆయన జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
