Latest Posts

తిరుమలలో మోహన్ భగవత్: శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఆయన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. సామాన్య భక్తులతో కలిసి కూర్చుని శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా అన్నప్రసాదాన్ని ఆరగించారు. అంతకుముందు అలిపిరి పాదాల చెంత ఉన్న సప్త గోప్రదక్షిణ శాలను సందర్శించిన ఆయన, హిందూ ధర్మంలో గోపూజ విశిష్టతను కొనియాడారు.

అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందుతున్న సేవలపై భగవత్ ఆరా తీశారు. వంటశాల నిర్వహణ, పరిశుభ్రతను స్వయంగా పరిశీలించి టీటీడీ అధికారులను అభినందించారు. మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసులు తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం (డిసెంబర్ 26, 2025) ఉదయం మోహన్ భగవత్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందిస్తారు. ఈ పర్యటన అనంతరం ఆయన తిరుపతిలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Posted Under AP
YES9 TV