రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర హోం మంత్రి వంగళపూడి అనిత తెలిపారు. పోలీసు యంత్రాంగానికి అవసరమైన అన్ని రకాల ఆధునిక పరికరాలతో పాటు, రాజకీయ జోక్యం లేని పూర్తి స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆమె స్పష్టం చేశారు.తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో హోమంత్రి అనిత, పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మరియు తిరుపతి జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందించిన అత్యాధునిక బ్రీత్ అనలైజర్ పరికరాలను మంత్రులు మరియు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా జిల్లా పోలీసు శాఖకు అందజేశారు. ఈ పరికరాలు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడంలో కీలకంగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
అనంతరం తిరుపతి జిల్లా పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర మంత్రులకు అధికారులు ప్రజాప్రతినిధులు సాదరంగా వీడ్కోలు పలికారు
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణను పటిష్ట చర్యలు:హోం మంత్రి వంగలపూడి అనిత.
