- చిత్తూరు వాసులకు వేలూరు సీఎంసీ సేవలు
- పీపీపీ విధానంలో కుదిరిన ఒప్పందం
- ఎంవోఏపై కలెక్టరు, ఆస్పత్రి డైరెక్టరు సంతకాలు
చిత్తూరు ప్రజలకు శుభవార్త. వేలూరు సీఎంసీ, చిత్తూరు క్యాంపస్ మధ్య పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున చిత్తూరు కలెక్టరు సుమిత్ కుమార్, సీఎంసీ తరపున ఆస్పత్రి డైరెక్టరు డాక్టర్ విక్రమ్ మాథ్యూస్ మంగళవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మిట్టూరు వార్డులో ఉన్న ప్రభుత్వ పాత ప్రసూతి కేంద్రంలో సీఎంసీ చిత్తూరు క్యాంపస్ వైద్యులను నియమించి అవుట్ పేషెంట్ చికిత్సలు, వైద్య సలహాలు, చికిత్స సమన్వయ సేవలను అందించనుంది. అలాగే పట్టణ పరిసరాల్లోని సేవల లేమితో బాధపడుతున్న స్లమ్ ప్రాంతాలు, చేరుకోవడం కష్టమైన ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్య సేవలను విస్తరించనుంది. ఈసందర్భంగా కలెక్టరు సుమిత్ కుమార్ మాట్లాడుతూ… పట్టణ ప్రాథమిక వైద్య సేవల ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది ఒక నూతన ముందడుగు అన్నారు. ప్రజారోగ్య రంగంలో ఇలాంటి వినూత్న భాగస్వామ్యాలకు ప్రభుత్వం సంతోషంగా ముందుకు వచ్చి మద్దతు ఇస్తోందని… భవిష్యత్తులోనూ ఈ తరహా కార్యక్రమాలను ప్రోత్సహిస్తామన్నారు. ఇక సీఎంసీ డైరెక్టరు డాక్టర్ విక్రమ్ మాథ్యూస్ మాట్లాడుతూ… సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్య సేవలు అందించడమే సీఎంసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఆ లక్ష్యసాధనలో ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం లభించడం ఆనందకరమని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి సంక్రమణ కాని వ్యాధులు ప్రధాన ప్రజారోగ్య సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సమయానుకూలంగా, అవసరానుగుణంగా చికిత్స అందడంతో పాటు నిరంతర చికిత్సకు మరింత భరోసా కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, సీఎంసీ చిత్తూరు క్యాంపస్ చెందిన అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఉదయ్ జకారియా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. రాజేష్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ డోరోథీ లాల్, ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ లోకేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్విన్ తదితరులు హాజరయ్యారు.
