హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) లో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని అభిప్రాయపడుతూ గత కొద్ది రోజులుగా సాగుతున్న న్యాయపోరాటానికి తెరదించింది.
ఈ విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయలేదని, అలాగే అభ్యంతరాల స్వీకరణకు ప్రజలకు తగినంత సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వార్డుల సరిహద్దుల నిర్ణయంలో శాస్త్రీయత లోపించిందని వారు పేర్కొన్నారు. అయితే, డీలిమిటేషన్ నోటిఫికేషన్ పూర్తిగా చట్టపరిధిలోనే ఉందని, సమాచారాన్ని ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిచ్చారు.
వార్డుల విభజనపై ఇప్పటి వరకు సుమారు 3,100 అభ్యంతరాలు అందాయని, వాటన్నింటినీ నిబంధనల ప్రకారం పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ప్రభుత్వ వివరణతో ఏకీభవించిన హైకోర్టు, ఈ పరిపాలనాపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో జీహెచ్ఎంసీ ఎన్నికల దిశగా వార్డుల పునర్వ్యవస్థీకరణ పనులకు లైన్ క్లియర్ అయినట్లయింది.
