ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసు (DDO) ప్రారంభోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “వర్షించని మేఘం… శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే అన్నట్లుగా, కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి కూడా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురాకపోతే ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో మార్పుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి (Promotion) యొక్క విలువ తెలుసు కాబట్టే, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని సుమారు 10 వేల మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా పదోన్నతులు కల్పించగలిగామని పవన్ కల్యాణ్ వివరించారు. అంతేకాక, అవినీతిని అరికట్టడం మరియు బలహీనుల గొంతుగా మారడం జనసేన ముఖ్య లక్ష్యమని, తమ జిల్లాకు తలమానికం అయిన శేషాచలం అడవుల సంపదను అడ్డగోలుగా దోచుకున్న వారిని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
కూటమిలోని మూడు పార్టీలకు విభిన్న భావజాలాలు ఉన్నప్పటికీ, రాష్ట్రం బాగుండాలి అనే సదుద్దేశంతోనే అందరూ ఒక గొడుగు కిందకు వచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఐక్యతతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైన శక్తిగా మారగలిగామని, ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని గుర్తింపు ఇస్తామని, గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజకవర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
