Latest Posts

పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ సంచలన హెచ్చరిక: ‘మేము వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేసి భూములన్నీ స్వాధీనం చేసుకుంటాం!’

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘HILTP (Hyderabad Information Technology and Engineering Consultancy) పాలసీ’ పేరుతో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. మేడ్చల్ జిల్లా, షాపూర్ నగర్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఆయన, ఒకప్పుడు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం పరిశ్రమలకు ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఈ భూములను పరిశ్రమలు కాకుండా అపార్ట్‌మెంట్లు, విల్లాలకు కేవలం రూ. 4,000 గజం ధరకే అప్పచెప్పడం దోపిడీ అని, మార్కెట్లో రూ. 1.5 లక్షలు పలుకుతున్న ఈ భూములను ప్రభుత్వం అప్పనంగా ఇస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, కేటీఆర్ పారిశ్రామికవేత్తలకు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. “మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాము. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని కూడా తీసుకువస్తాము. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయి” అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని అక్కడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు కట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ భారీ కుంభకోణాన్ని ప్రజలకు, కాలనీలకు వివరిస్తామని, త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం మరియు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని, లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి సంబంధించిన సమాచారం తమకు తెలంగాణ బిడ్డ ఒకరు అందించారని, దీనిపై సమాధానం చెప్పకుండా, ‘సమాచారం లీక్ అయింది’ అంటూ ప్రభుత్వం బాధపడుతోందని ఆయన విమర్శించారు.

Editor