శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అన్నదానం విషయంలో శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న వెజ్ పులావ్, సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు, పాయసంతో కూడిన పూర్తిస్థాయి కేరళ సంప్రదాయ భోజనం (సద్య) వడ్డించనున్నారు. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు కె. జయకుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు జయకుమార్ మాట్లాడుతూ, “ఇది భక్తులు సమర్పించిన విరాళాల ద్వారా అందిస్తున్న సేవ. అందుకే తోటి భక్తులకు ఉత్తమమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో నాణ్యమైన పదార్థాలతో సంప్రదాయ కేరళ సద్యను అందించాలని నిర్ణయించాం” అని వివరించారు. ఈ కొత్త మెనూ మార్పు త్వరలోనే అమల్లోకి వస్తుందని తెలిపారు. అలాగే, పంబలో కూడా అన్నదానం సేవలను మెరుగుపరుస్తామని, యాత్రికుల సౌకర్యార్థం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మండల-మకరవిళక్కు సీజన్ కావడంతో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. ఆలయం వెనుక మాలికాపురంలోని అన్నదాన భవనం ఆసియాలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ఇక్కడ రోజుకు 10,000 మందికి పైగా భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు అన్నదానం స్వీకరించారు. కొత్త మెనూ మార్పు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.
