తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీర ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. నిజమైన అర్హులైన మహిళలకు చీరలు అందడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు.
హరీశ్ రావు మాట్లాడుతూ, కేవలం ఒక్క చీర ఇచ్చి ప్రభుత్వం పెద్ద సాయం చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి పథకం హామీ ప్రకారం ప్రతి మహిళకు రూ. 60 వేలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. చీరల పంపిణీ పేరుతో కాంగ్రెస్ తన ప్రధాన హామీని మార్చేసి ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు చీరలు పొందకపోవడం, గ్రామాల్లోనూ అనేక మంది అర్హులు వంచితులవుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అదే విధంగా, మహిళా సంఘాలకు వడ్డీరహిత రుణాల విషయంలోనూ ప్రభుత్వం చెబుతున్నదానికి, చేస్తున్నదానికి పొంతన లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మొత్తం రూ. 25 వేల కోట్ల రుణాలున్నా, అందులో కేవలం ఐదువేల కోట్లకే వడ్డీ మాఫీ వర్తిస్తోందని, మిగతా మొత్తానికి మహిళలు వడ్డీ భరించాల్సి వస్తోందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పండుగకు మహిళలను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయంలోనే పథకాలను ముందుకు తీసుకొస్తుందంటూ విమర్శించారు.
