ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడమే బలహీనతకు నిదర్శనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పదేపదే చెబుతున్నప్పటికీ, వాస్తవంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటం బలహీనతను సూచిస్తోంది. గత మూడు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2023-24లో 81,08,406 మంది విద్యార్థులుండగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 76,02,854కు పడిపోయింది. ప్రతి సంవత్సరం లక్షల్లో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలకు మారుతుండటం, ఒకే ఏడాదిలో 2,66,860 మంది ప్రైవేట్‌కు మారడం విధానాల వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడానికి బదులుగా, సమస్యలే పెరుగుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచే పాఠాలు చెప్పే సమయాన్ని యాప్‌లు, ఆన్‌లైన్ గణాంకాలు, రికార్డులు, మీటింగ్‌లు వంటి అప్రయోజక కార్యక్రమాలు అడ్డుకుంటున్నాయి. లీప్ యాప్, విద్యామిత్ర, ఐఎమ్‌ఎమ్‌ఎస్ వంటి అనేక అప్లికేషన్ల పనులు ఉపాధ్యాయుల సమయాన్ని పూర్తిగా ఆక్రమిస్తున్నాయి. దీంతో పాటు, 20 రోజుల యోగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్ వంటి కార్యక్రమాలతో బోధనా పీరియడ్‌లు తీవ్రంగా తగ్గాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితులు ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని విధంగా ఉపాధ్యాయులు “పాఠాలు చెప్పనీయండి” అంటూ ఉద్యమానికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మాతృభాషలో బోధన నిలిపివేత, పూర్తిగా ఆంగ్ల మాధ్యమం, 9 రకాల పాఠశాలలు, సింగిల్ మీడియం, 12 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు వంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో గందరగోళాన్ని పెంచాయి. ఈ నష్టదాయక సంస్కరణలను తక్షణమే రద్దు చేయాలని, ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకే పరిమితం చేయాలని, విస్తృత చర్చల ద్వారా విధానాలను సరిదిద్దాలని, తద్వారా విద్యారంగం బలోపేతం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Posted Under AP
Editor