విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో, రిలయన్స్ సంస్థ కూడా అదే బాటలో ఏపీకి క్యూ కడుతోంది. ఈ సదస్సులో భాగంగా, రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక గిగావాట్ సామర్థ్యం గల ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రిలయన్స్ కేవలం ఏఐ డేటా సెంటర్ మాత్రమే కాకుండా, సోలార్ పవర్ ప్లాంట్ మరియు గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ వంటివాటిని కూడా ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు జరిపిన భేటీలో ఈ వివరాలను వెల్లడించారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ జీపీయూలు (GPUs), టీపీయూలు (TPUs) మరియు ఏఐ ప్రాసెసర్‌లను అమర్చనున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న రిలయన్స్ గిగావాట్-ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా దీనిని విశాఖలో నిర్మించనున్నారు. ఈ రెండు డేటా సెంటర్ల కోసం రిలయన్స్ సుమారు రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏపీలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రానుంది.
ఈ భారీ మొత్తంలో పెట్టుబడులు రావడంతో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 400లకు పైగా ఎంవోయూలు (MOU) కుదుర్చుకుంది. వీటి ద్వారా సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. రిలయన్స్ పెట్టుబడితో పాటు, బ్రూక్ ఫీల్డ్ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడి, నీన్యూ ద్వారా రూ. 82 వేల కోట్లు, ఎస్ ఏఈఎల్ పరిశ్రమ నుంచి రూ. 22 వేల కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ద్వారా రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
