సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లై కేవలం మూడు నెలలకే ఒక నవ వధువు అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత (21) అనే వివాహితకు, కండెల రోహిత్‌కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది.
వివాహం జరిగిన నెల వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత భర్త రోహిత్, అతని తల్లిదండ్రులు కలిసి వసంతను వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వేధింపులు భరించలేక వసంత ఈ నెల ఒకటో తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మృతి చెందింది.
మరోవైపు, వసంత కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతికి అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులే కారణమని ఆరోపించారు. తమ కూతురి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వసంత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
