వర్క్ ఫ్రమ్ హోమ్ విషాదం: యాదాద్రి జిల్లాలో విద్యుదాఘాతంతో ఐటీ ఉద్యోగి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువకుడు భూషి గణేశ్, ఇంటి నుంచి (వర్క్ ఫ్రమ్ హోమ్) విధులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది. ఆ కుటుంబానికి ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

వివరాల్లోకి వెళితే.. ఇంటికి చేసిన ప్లాస్టరింగ్ పనుల కోసం ఉపయోగించిన ఇనుప పైపులను గణేశ్ తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో, ఆ పైపు ప్రమాదవశాత్తు సమీపంలోని విద్యుత్ తీగలకు తగలడంతో గణేశ్‌కు తీవ్రంగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన కొడుకును గమనించిన తండ్రి నర్సింహ వెంటనే అతడిని కాపాడబోయారు. కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి నర్సింహకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

అయితే, మార్గమధ్యంలోనే గణేశ్ ప్రాణాలు విడిచాడు. కళ్ల ముందే కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో లింగరాజుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Posted Under AP
Editor