Latest Posts

వివాదాస్పద మ్యాప్‌తో భారత్‌ను రెచ్చగొట్టిన బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారికి బహుమతిగా ఇచ్చిన వివాదాస్పద మ్యాప్ కారణంగా భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యారు. ఢాకాలో పర్యటించిన పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు యూనస్ ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం కవర్‌పై ఉన్న మ్యాప్‌లో భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో కలిపి చూపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు కోరుతున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ వాదనకు బలం చేకూర్చేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివాదాస్పద ఫోటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో యూనస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నారని, భారత సార్వభౌమాధికారంలోకి ఆహ్వానం లేకుండా అడుగుపెట్టారని విశ్లేషకులు, జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

కాగా, యూనస్ ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించడం ఇది మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా విదేశీ కార్యకలాపాలలో ఆయన ఈ ప్రాంతం గురించి పదేపదే ప్రస్తావించారు. ఏప్రిల్‌లో చైనా పర్యటన సందర్భంగా, ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర సంరక్షకులు తామే అని ప్రకటించడం ద్వారా ఆయన భారత్‌కు కోపం తెప్పించారు. చైనా తన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్రాంతంలో విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశమని కూడా ఆయన సూచించడం విశేషం.

Editor