ఇటీవల కాలంలో సైబర్ మోసగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీలు మరియు ఉన్నతాధికారుల ఫోటోలను వాట్సాప్ డీపీ (Display Picture)గా పెట్టుకుని నకిలీ ఖాతాలతో మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో, సైబరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ డీపీతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ, వాట్సాప్‌లో తన ఫోటోను డీపీగా పెట్టుకుని సందేశాలు పంపిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అవి నకిలీ ఖాతాలు మరియు పూర్తిగా మోసపూరితమైనవని కొట్టిపారేశారు. ప్రజలు ముఖం చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దని, ఇలాంటి సందేశాలకు స్పందించవద్దని ఆయన హెచ్చరించారు. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయాలని ప్రజలకు సూచించారు.
సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వవద్దని, డబ్బులు అడిగితే పంపించవద్దని సజ్జనార్ స్పష్టం చేశారు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్ట అనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన కోరారు.
