కార్తీకమాసం ప్రారంభమవడంతో అయ్యప్ప దీక్షలు తీసుకున్న భక్తుల కోసం విశాఖపట్నంలో 41 రోజులపాటు మహా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ కోదండరామ ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాల ధరించిన భక్తులు తమ మండల దీక్ష కాలంలో బయట శుద్ధిగా వండిన ఆహారం దొరకక ఇబ్బందులు పడకుండా ఉండే ఉద్దేశంతో ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మాల ధరించిన ఏ ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ఈ విశేష సాయాన్ని అందిస్తున్నారు.
మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం అక్టోబర్ 23వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనుంది. ట్రస్ట్ అధ్యక్షులు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, వైర్లెస్ కాలనీలోని కోదండ రామాలయంలో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు సుచికరమైన, రుచికరమైన మడితో వండిన భోజనం అందించడానికి సంకల్పించారు. ఈ అన్నదానం ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి 2:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రోజుకి సుమారు 1500 నుండి 2000 వరకు మాల ధరించిన భక్తులకు అన్నదానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ అన్నదాన కార్యక్రమాన్ని వైర్లెస్ కాలనీ కోదండ రామాలయం వద్ద నిర్వహిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశయులు, అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. భక్తి భావంతో వస్తురూపంగా గాని (బియ్యం, పప్పుదినుసులు, కాయగూరలు వంటివి) లేదా విరాళాల రూపంలో గాని సహాయం చేయవచ్చని కోరారు. విరాళాలు సమర్పించేవారు శ్రీ హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం పేరున అందించి, రసీదు పొందవలసిందిగా తెలిపారు.
