దీపావళి పండగవేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ రైతులకు అండగా నిలిచేందుకు ఆయన మంగళవారం తన అధికారిక నివాసం వద్ద 1000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలతో కూడిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. “బాధలో ఉన్నవారికి మనం అండగా నిలిచినప్పుడే పండుగ అసలైన ఆనందం ఉంటుంది” అని యోగి అన్నారు. పంజాబ్ రైతులు ఈ కష్టకాలంలో ఒంటరి కారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రతి బాధితుడికి అండగా నిలుస్తుందని, సహాయ సామాగ్రి, ఆర్థిక సహాయం, పునరావాసం లాంటి ప్రతి స్థాయిలోనూ ఆదుకుంటామని సీఎం యోగి భరోసా ఇచ్చారు.
ఈ ఏడాది పంజాబ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జనజీవనం ప్రభావితం అవ్వడమే కాకుండా, రైతుల విత్తన నిల్వలు కూడా నాశనమయ్యాయని సీఎం యోగి తెలిపారు. దీనివల్ల తర్వాతి పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంజాబ్‌కు వేలాది బస్తాల (1000 క్వింటాళ్లు) గోధుమ విత్తనాలను పంపడం ద్వారా రైతులకు ఒక కొత్త ఆశను ఇస్తుందని యోగి పేర్కొన్నారు. పంజాబ్ కోసం పంపిన విత్తనం ‘బీబీ-327’ రకానికి చెందినవని, ఇది రోగ నిరోధక, పోషకాలున్న బయో-ఫోర్టిఫైడ్ గోధుమ అని, కేవలం 155 రోజుల్లో ఉత్పత్తయ్యే ఈ రకం హెక్టారుకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇవ్వగలదని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ విత్తనం రైతులకు సహాయపడటమే కాకుండా, ఉత్తరప్రదేశ్ విత్తన, అభివృద్ధి సంస్థ పురోగతికి, విశ్వసనీయతకు చిహ్నమని యోగి అన్నారు. దేశంలోని మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో ఉత్తరప్రదేశ్ వాటా కేవలం 11 శాతమే అయినప్పటికీ, దేశ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం 21 శాతం వాటా అందిస్తోందని యోగి తెలిపారు. ఇది యూపీ రైతుల కష్టానికి ఫలితం మాత్రమే కాదు, ప్రభుత్వ విధానపరమైన సామర్థ్యం, సాంకేతికతకు కూడా నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
