తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
దక్షిణ అండమాన్‌ను ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలను ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి, మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా, గురువారం రోజున ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రైతులు వరి ధాన్యం కోసి, వడ్లను ఆరబోస్తున్న సమయంలో ఈ అకాల వర్షాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల మార్కెట్ యార్డుల్లో పోసిన ధాన్యం వర్షాలకు తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
