ప్రతి సంవత్సరంలాగే, ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఈసారి ఆయన గోవా సముద్ర తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ (INS Vikranth) యుద్ధ నౌకను సందర్శించి, నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేవీ అధికారులతో కలిసి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం తనకు గర్వంగా ఉందని తెలిపారు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే, మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఉందని ఆయన కొనియాడారు.
దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన రక్షణ సామర్థ్యానికి ప్రతీక అని అన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ఇండియన్ నేవీ ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యంగా **ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)**లో సత్తా చాటిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్ర పట్టదని, అది పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చిందని, పాక్‌ను మోకాళ్లపై కూర్చొబెట్టిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పాక్ సరిహద్దు జలాల్లో మోహరించింది. ఇస్లామాబాద్ ఎదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే దాడి చేయడానికి ఈ నౌకను సిద్ధంగా ఉంచింది. దీనిని ప్రస్తావిస్తూ మోదీ, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను చూసి పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయన్నారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్ మరియు మేడిన్ ఇండియాకు ప్రతీక అని తెలిపారు. అలాగే, బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైళ్లు కూడా తమ సత్తా ఏంటో చూపించాయని ఆయన పేర్కొన్నారు.
