నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హతమార్చిన కేసులో రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అయిన ఘటనపై నిజామాబాద్ సీపీ సాయిచైతన్య స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. సోమవారం ఉదయం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా విధుల్లో ఉన్న ఆర్ఐ (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) వార్డు వద్దకు వెళ్లగా, తలుపు, అద్దం పగులగొడుతున్న శబ్దం వినిపించింది. దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వగా, ఆర్ఐతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వార్డులోకి వెళ్లారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం, రియాజ్ వార్డులో హంగామా సృష్టిస్తుండడంతో, అతడిని బెడ్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో నిందితుడు కానిస్టేబుల్ వద్దనున్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. ఆర్ఐ వారిస్తున్నా వినిపించుకోకుండా రియాజ్ ట్రిగ్గర్ నొక్కడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ఐ రియాజ్‌పై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు కుప్పకూలిపోయాడని సీపీ వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాలిటీస్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, కానిస్టేబుల్ ప్రమోద్‌పై రియాజ్ చేసిన దాడిలో ఆసిఫ్ అనే వ్యక్తికి కూడా గాయాలైన విషయం తెలిసిందే. గాయపడిన బాధితుడు ఆసిఫ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు సీపీ సాయిచైతన్య ఈ సందర్భంగా తెలిపారు. రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ ఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది.
