ఏపీలో కూటమి సర్కార్ ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది కాలంలో సంక్షేమ పథకాల విషయంలో వెనుకబడిందన్న విమర్శలకు చెక్ పెట్టేలా చంద్రబాబు వరుస పథకాల జాతరకు తెరలేపారు. అయితే ఇందులో అర్హుల్ని పక్కనబెట్టేస్తున్నారంటూ వైసీపీ విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తమపై చేస్తున్న విమర్శలపై చికాకు పడుతున్న సీఎం చంద్రబాబు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రండి తేల్చుకుందామని సవాల్ విసిరారు.
దీనిపై ఇవాళ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అసెంబ్లీకి వస్తే అర్థవంతమైన చర్చలు చేసుకొందామని వైసీపీ ఎమ్మెల్యేల్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించారని, ఆయన దృష్టిలో అర్థవంతమైన చర్చలంటే ఏంటని సజ్జల ప్రశ్నించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవి నాలుగే పార్టీలని, ఇందులో మూడు పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని గెలిచి అధికారంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఇక మిగిలింది వైసీపీయేనని, అందుకే ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నామని సజ్జల తెలిపారు.
తాము విపక్ష హోదా అడుగుతోంది హక్కుగా కాదని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకేనని సజ్జల తెలిపారు. అది ఇవ్వకుండా చంద్రబాబు అసెంబ్లీకి రావాలని సవాళ్లు విసురుతున్నారని, బలాబలాల ప్రదర్శనకు అదేమీ బాక్సింగ్ రింగ్ కాదన్నారు. చంద్రబాబు బలప్రదర్శన చేసేందుకే అసెంబ్లీకి రమ్మని తమను అడుగుతున్నారన్నారు. కాబట్టి చంద్రబాబుకూ తామూ ఓ సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు సమానమైన తమ నాయకుడు జగన్ కు విపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నట్లు తెలిపారు. అది ఇస్తే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమన్నారు.
తమకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారని, వారు అధికార పక్షంలోని 164 మంది ఎమ్మెల్యేలకు సమానమని సజ్జల తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే చంద్రబాబుకు తగిన సమాధానం చెప్తారని సజ్జల పేర్కొన్నారు. జగన్ కు విపక్ష హోదా విషయంలో హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కు ఓ ఆదేశం ఇచ్చినా సరిపోతుందన్నారు. చంద్రబాబుకు ఇంత పెద్ద మెజార్టీ ఎందుకిచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
