- సెంట్రల్ యూనివర్శిటీలో అమ్మాయిల భద్రత చర్యలు వెంటనే చేపడతాం
- యూనివర్శిటీలో స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నాం
- నిర్మాణాలు ప్రాధాన్యతగా పూర్తికి చర్యలు
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీని పరిశీలించి విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులతో వేరువేరుగా సమావేశం నిర్వహించి వివరాలు ఆరా తీసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి.జగదీష్..
అనంతపురం, ఫిబ్రవరి 17 :
– *సెంట్రల్ యూనివర్శిటీలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులతో వేరువేరుగా సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ వివరాలు ఆరా తీశారు. తదనంతరం జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థినీ విద్యార్థులతో సమావేశం నిర్వహించామని, యూనివర్శిటీలో సౌకర్యాలు బాగా లేకపోవడం వల్ల, సెక్యూరిటీ సమస్యలున్నాయని మీడియాలో రావడంతో వెంటనే అధికారులను ఇక్కడికి పంపించడం జరిగిందన్నారు. స్థానిక తహసిల్దార్, సిఐ, ఆర్డిఓ, డిఎస్పిలు ఇక్కడికి చేరుకున్నారన్నారు. తాను, జిల్లా ఎస్పీ ఇక్కడికి రావడంతో విద్యార్థులు తమకు కొన్ని సమస్యలు చెప్పుకోవాలని అనుకున్నారని, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులతో తాము మాట్లాడడం జరిగిందన్నారు. ఇక్కడ రెండు పెద్ద సమస్యలు ఉన్నాయని, ఇది కొత్త యూనివర్సిటీగా ఏర్పాటు అవుతోందని, నిర్మాణంలో ఉందని, 491 ఎకరాలలో ఏర్పాటు అవుతోందని, ఇక్కడ వివిధ దశలలో పనులు జరుగుతున్నాయన్నారు. బాలికల హాస్టల్ లో సేఫ్టీ మరియు సెక్యూరిటీ అనేది యూనివర్సిటీ వారు ఏర్పాటు చేయాల్సినదని, అయినా సరే విద్యార్థినీల సేఫ్టీ మరియు సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనదన్నారు. అమ్మాయిల భద్రత అంటే ముఖ్యమైనదిగా చూస్తాం కాబట్టి అందుకు వెంటనే చర్యలు చేపడతామన్నారు. సౌకర్యాల కల్పనకు సంబంధించి అకడమిక్ సౌకర్యం, ఫ్యాకల్టీ ఏర్పాటు, లాంటి వాటిపై వివరంగా మాట్లాడుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామనే నమ్మకాన్ని ఇవ్వడం జరిగిందని, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే విషయమై యూనివర్సిటీకి లిఖితపూర్వకంగా కూడా రాయడం జరుగుతుందన్నారు. యూనివర్శిటీలో స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందులో యూనివర్సిటీ తరఫునుంచి కొంతమంది అధ్యాపకులు, విద్యార్థులు, డేస్ స్కాలర్స్ మరియు హాస్టల్ విద్యార్థులు ఉంటారన్నారు. స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయడం వల్ల సమావేశాలు నిర్వహించుకుని ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. హాస్టల్ కి యాక్సెస్ కంట్రోల్ చేయడం, అదనంగా సెక్యూరిటీ కావాలనుకోవడం, ఇలాంటివి పెట్టుకోకపోవడం వల్ల కమ్యూనికేషన్ లో గ్యాప్ అనేది కనపడిందని, అది కూడా వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. మే నెల వరకు సెంట్రల్ యూనివర్సిటీలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి స్థానిక తహసిల్దార్ పుణ్యవతి ప్రతివారం వచ్చి యూనివర్సిటీని తనిఖీ చేసి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడం జరుగుతుందని, హాస్టల్ వద్ద జరుగుతున్న నిర్మాణాలు ప్రాధాన్యతగా పూర్తి చేయడం చేయాలని, దీనిని పర్యవేక్షణ చేస్తారన్నారు. అలాగే అధ్యాపకులతో కూడా సమావేశం నిర్వహించామన్నారు. విద్యార్థులకు కూడా ఎలాంటి ఆందోళనకు గురికావద్దని తెలియజేశామని, పరీక్షలపై దృష్టి సారించాలని చెప్పామన్నారు. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వచ్చారని, చాలా ఉత్తమ విద్యార్థులు ఉన్నారని, యూనివర్సిటీలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్నారు.*
– *హాస్టల్ భవనం నిర్మాణంలో ఉంది కాబట్టి సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఇబ్బంది కలుగుతోందని విద్యార్థినీలు చెప్పడం జరిగిందని, ఇందుకోసం వర్క్ టైమింగ్స్ ఏర్పాటు చేస్తున్నామని, రాత్రిపూట కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఉండదని, ముందు ప్రాధాన్యతగా హాస్టల్లో పనులు పూర్తి చేస్తామని, అలాగే మహిళా అధికారులను కూడా పంపిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సెక్యూరిటీ ఆడిట్ చేయిస్తున్నారని, అందులో ఈరోజు మహిళా ఎస్సై కూడా వచ్చారని, తహసిల్దార్ కూడా స్వయంగా వెళ్లి వాష్ రూమ్ లను పరిశీలన చేశారన్నారు. సంపూర్ణమైన ప్రైవసీపరంగా ఆడిట్ అనేది జరిగిందన్నారు. అదే కాకుండా సెక్యూరిటీ ఆడిట్ అంటే సీసీ కెమెరాలు హాస్టల్ చుట్టుపక్కల నాలుగు దిశలలో కెమెరాలు ఏర్పాటు, వాటికి పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, వాటికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. ఇలా పలు సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం అనేది ఉంటే ఇలాంటివి వారి స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. యూనివర్సిటీలో సిస్టం మరింత బలోపేతం కావాలన్నారు. యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఇక్కడ భనవ నిర్మాణాలు మూడు దశల్లో చేశారని, అవసరమైన భూమి, విద్యుత్ సమస్యలు, ఇతర సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్నారు.*

– ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామన్నారు. ఇంతకుముందు యూనివర్సిటీలో జరిగిన మొదటి ఘటనపై కేసు నమోదు అయిందని, దానిపైన ఇన్వెస్టిగేషన్ పురోగతి జరుగుతోందన్నారు. ఇంతకుముందు ఘటన జరిగినప్పుడు సీసీ కెమెరాలు, లైటింగ్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, లాంటి విషయమై కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని, వాటిలో కొన్ని అమలు చేయడం జరిగిందని, మరికొన్ని అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. అది కాకుండా పూర్తిస్థాయి సెక్యూరిటీ ఆడిట్ ఈరోజు రాత్రికి, రేపటికి పూర్తి చేయడం జరుగుతుందని, దానిని అమలు చేసేందుకు వీసీకి వివరాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

– ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ డీన్ ఎన్.కోరి, ఆర్డీఓ కేశవ నాయుడు, డిఎస్పీ వెంకటేశులు, తహసిల్దార్ పుణ్యవతి, సిఐ కరుణాకర్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————
DIPRO.I&PR.ATP..
