ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందనగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత మంగళగిరి రూరల్ పీఎస్ కు లాయర్ పొన్నవోలు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి వచ్చారు. అయితే సజ్జలను మాత్రమే లోపలికి అనుమతించారు. దాదాపు గంట సేపు విచారణ తర్వాత సజ్జలతో పాటు విచారణాధికారి బయటికి వచ్చారు.
ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి 120వ ముద్దయిగా ఉన్నారని, ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేయమని అడిగినట్లు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే సజ్జల అందుకు నిరాకరించారన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో సజ్జల పాత్రపై ప్రశ్నించినా విచారణకు సహకరించలేదని తెలిపారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నా సజ్జల మాత్రం తాను ఊర్లో లేనని చెప్తున్నారన్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితులు హైకోర్టు, సుప్రీం కోర్టు రక్షణ తీసుకున్నారు కాబట్టి దర్యాప్తులో పురోగతి సరిగా లేదని మంగళగిరి సీఐ తెలిపారు. అరెస్టు చేస్తేనే తమకు ఈ కేసులో క్లారిటీ వస్తుందన్నారు. సజ్జలను మొత్తం 38 ప్రశ్నలు అడిగామని, అన్నిటికీ సమాధానం తెలీదు ,గుర్తు లేదు,అని చెప్పినట్లు వెల్లడిచారు. ముద్దాయిలు సహరించకుండా కోర్టులను ఆశ్రయించడంతో ఈ కేసును సీఐడీ కి అప్పగిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతల్ని పోలీసులు వేధిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలి వేశారన్నారు. కేవలం వైసీపీ వారిని వేదించటం పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తనను కూడా ఇవాళ విచారణకు పిలిచారని సజ్జల తెలిపారు. రోజూ నిందితుల సంఖ్య పెంచుతున్నారని, ఘటన జరిగిన రోజు అసలు తాను ఇక్కడ లేనన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనతో తనకు సంబంధం లేదన్నారు. చాలా దూరంలో వేరే కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆ వివరాలను ఇవాళ విచారణ అదికారులకు ఇచ్చానని తెలిపారు. దర్యాప్తు పేరిట జరుగుతున్నదంతా ఫార్స్ అని, టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన తప్పుడు సంస్కృతికి బదులు కూడా ఇలాగే ఉంటుందని హెచ్చరించారు
