తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారరైంది. అక్టోబర్ 23న రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రవర్గం భేటీ కానుంది. 23న సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్దంగా మారడం, హైడ్రా ఏర్పాటును హైకోర్టు సమర్థించడం వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
అంతేగాక, మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా బాలకిష్టారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన ఛైర్మన్‌గా ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా సుదీర్ఘ కాలం పనిచేసి, ప్రస్తుతం మహీంద్ర యూనివర్సిటీ లా స్కూల్ డీన్‌గా వ్యవహరిస్తున్న బాలకిష్టారెడ్డిని ప్రభుత్వం తాజాగా నియమించింది.
విద్యామండలి వైస్ ఛైర్మన్‌గా ఉన్న వెంకటరమణ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగం నుంచి ఇటీవలే పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను కొత్తగా నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వారి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
