Latest Posts

బడ్జెట్ లో భట్టి విక్రమార్క.. ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..!

తెలంగాణ క్యాబినేట్ భేటీ ప్రారంభమైంది. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ పై చర్చిస్తున్నారు. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతకుముందు.. బడ్జెట్ పద్దుతో ప్రజాభవన్‌లో పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు భట్టి దంపతులు.

 

రుణమాఫీ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు అగ్రపీట వేస్తూ 2024-25 ఏడాదికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రేవంత్‌ సర్కార్ సిద్ధమయింది. 2.95 లక్షల కోట్ల రూపాయల నుంచి 2.97 లక్షల కోట్ల రూపాయల వరకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

 

అగ్రికల్చర్, విద్యకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి 31 వేల కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 14 వేల కోట్ల రూపాయలు, రైతుబీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున పద్దు పెట్టనుంది. ఎడ్యుకేషన్‌కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

 

ఇరిగేషన్‌కు 25 వేల కోట్ల రూపాయలు పైనే కేటాయించనున్నది. మూసీ రివర్‌ ఫ్రంట్‌కు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. జీత భత్యాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు. GSDPలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ 1.70 లక్షల కోట్ల రూపాయలకు పైన వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 25వేల కోట్ల రూపాయలు నుంచి 30 వేల కోట్ల రూపాయలు రాబట్టుకోవాలని ప్రతిపాదనలు చేశారు.

 

60 వేల కోట్ల రూపాయలు వరకు అప్పులు తీసుకోనున్నారు. ఇతరత్రా అన్నీ కలిపితే బడ్జెట్ 2.95 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశముంది. పదేళ్ల కాలంలో గత BRS సర్కారు బడ్జెట్‌ను వాస్తవానికి 10 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుతూ వచ్చింది. అయితే, ఈ సారి అంకెలు మార్చి గారడీ చేయకుండా.. ఎంత వస్తుందో అంతే పెట్టుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.

Editor