Latest Posts

సముద్రగర్భంలో రామసేతు వంతెన..! ఫొటోలు రిలీజ్ చేసిన ఇస్రో..

భారత్ – శ్రీలంక మధ్య త్రేతాయుగంలో నిర్మించారని చెబుతున్న రామసేతు కాల్పనికం కాదని.. సముద్ర భూగర్భంలో రామసేతు ఉందన్న విషయం నిజమేనని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వెల్లడించింది. తమిళనాడులో రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్ ను.. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్ శాట్ 2 డేటాను ఉపయోగించి రిలీజ్ చేశారు. ఇండియా – శ్రీలంకల మధ్యనున్న ఈ రామసేతు వంతెన పొడవు 29 కిలోమీటర్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. సముద్రగర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో రామసేతు ఉన్నట్లు పేర్కొన్నారు.

తమిళనాడులోని రామేశ్వరానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపం తలైమన్నార్ వాయవ్యం వరకూ ఈ రామసేతు విస్తరించి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్థారించారు. దీనిని సున్నపురాయితో నిర్మించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఇది 99.98 శాతం నీటిలోనే ఉందని వెల్లడించారు. 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ వరకూ.. అంటే ఆరేళ్ల డేటాను ఇస్రో సిద్ధం చేసింది. దీనిపై జోధ్ పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు పరిశోదనలు చేశారు.

త్రేతాయుగంలో రామాయణకాలంలో.. లంకాధిపతి అయిన రావణుడు సీతమ్మను అపహరించి లంకలోనే ఉంచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హనుమంతులవారు లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడను కనుగొని రాములోరికి చెబుతాడు. వానరసైన్యంతో లంకకు చేరుకునేందుకు ఈ రామసేతును నిర్మించారు. క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకూ పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధైగా పిలిచారట. రామేశ్వరంలో ఉన్న రికార్డుల ప్రకారం.. 1480 వరకూ వచ్చిన తుపానుల కారణంగా రామసేతు ధ్వంసమైంది.

Editor