Latest Posts

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్..

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిగా మద్దతుగా కేసీఆర్ భువనగిరిలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అనేక సమస్యలు ఉంటే బీజేపీ అవేమీ పట్టించుకోకుండా అక్షింతలు, ప్రసాదాలు, శోభాయాత్రలపైనే దృష్టిపెట్టిందని విమర్శించారు.

 

బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గం వారైనా లభం పొందారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్.. 24 గంటల కరెంట్ నాశనం చేసిందని విమర్శించారు. మాయమైన బోరుబండ్లను మళ్లీ తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రైతు బంధు లేదు కరెంటూ లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేసీఆర్ విమర్శించారు. మిల్లర్లు దగ్గర కమిషన్లు తీసుకొని రైతులను గాలికి వదిలేశారన్నారు. తొమ్మిదేళ్లలో ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 225 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాథుడే లేరని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.

యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్న కేసీఆర్.. ఈ రోజు దాని ఊసేలేదన్నారు. ఇవాళ ఒక్క ప్రైవేటు కళాశాలకి కూడా ఫీజు రీయింబర్‌స్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు ఏమో కానీ లూటీలు చేస్తున్నారని కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రైతు బోనస్ రూ.500 అన్నారు ఎవరికైనా ఇచ్చారా? అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

 

తన గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారని.. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వారి కోసమే ఉంటానన్నారు కేసీఆర్. మంచి మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేశ్ ను గెలిపించాలని కోరారు. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది, మరో పార్టీ ఎక్కడికి వెళితే అక్కడ దేవుడిపై ఒట్టు వేస్తోందని కేసీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఓటర్లు ఆలోచించి పరిణితితో ఓట్లు వేయాలని కేసీఆర్ కోరారు.

Editor