తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారంనాడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్‌కు చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అనంతరం ఎస్ఆర్ఆర్కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకూ భారీ రోడ్‌షో నిర్వహించారు. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని ఖావడం కాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లిలో గడ్డం వెంకటస్వామి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నామినేషన్‌లో పాల్గొన్నారు. బీజేపీకి గుజరాత్‌లో ఒకస్థానం ఏకగ్రీవమైందని, ఇంకా 399 సీట్లే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పుష్కర్‌సింగ్ థామి పిలుపునిచ్చారు.
మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి ఖమ్మం కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సమక్షంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. గత బీఆర్ఎస్ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని విమర్శించారు. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మెదక్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ధ్యాన్ చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగియడంతో అధికారులు శుక్రవారం నుంచి వాటిని పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంది. మే 13న కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నయి.
