లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం భారత్ రాష్ట్ర సమితి ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించాలనే పట్టుదలతో ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్. లోక్‌సభ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించే పనిలో పడింది. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు పోతుగంటి రాములు. భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశ రాజదాని వేదికగా కొద్దిసేపటి కిందటే కాషాయ కండువాను కప్పుకొన్నారు. తన కుమారుడు పీ భరత్‌తో కలిసి బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు పీ రాములు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డీకే అరుణ.. ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.
2019 నాటి ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన మల్లు రవిని 1.89 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మూడుసార్లు అచ్చంపేట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
