Latest Posts

ఇంట్లోనే విచారించాలన్న కవిత పిటిషన్ మార్చి 13కు వాయిదా..

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది.

 

అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది సుప్రీంకోర్టు. మార్చి 13న చూస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

 

ఈ పిటిషన్ పై విచారణ ముగిసే వరకు కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడటంతో ఆదేశాలు అలాగే కొనసాగనున్నాయి.

 

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గత ఏడాది కవిత సవాల్ చేశారు. గతంలో ఆమె పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది. మూడు కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

Editor